ఇళ్లల్లో వరుస చోరీలకు పాల్పడుతున్న అంతర రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు
అక్షర కిరణం, (పెందుర్తి): పెందుర్తి సుజాతనగర్లో చోరీ కేసు దర్యాప్తులో అంతర రాష్ట్ర ముఠా గుట్టు రట్టయింది. దీనికి సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించారు. జూలై 22న కుటుంబ సభ్యులతో కలిసి ఇంటి కి తాళం వేసి గుంటూరు వెళ్లిన బాధితుడు.. జూలై 31న తిరిగి వచ్చేసరికి ఇంటి తలుపులు, బీరువా పగులగొట్టి ఉండటాన్ని గుర్తించాడు. ఇంట్లోని వస్తువులు చిందర వందరగా ఉండడంతోపాటు బంగారం, వెండి వస్తువులు చోరీకి గురైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసిన పెందుర్తి పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈక్రమంలో నిందితుల కదలికలపై నిఘా పెట్టి.. ఆగస్టు 10న సరిపల్లి ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అయిన వారిలో కట్టా శివశంకర్ అలియాస్ లడ్డు, మండే లా నాగభాస్కర్ అలియాస్ బాబీ, మడగల విజయ్‌కుమార్ ఉన్నారు. పోలీసుల విచారణలో పలు వివరాలు బయటకు వచ్చాయి. ఈకేసులో మొదటి నిందితుడిపై గతంలో ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలో 87 ఇంటి చోరీ కేసులు, రెండో నింది తుడిపై 82 కేసులు, మూడో నిందితుడిపై 86 ఇంటి, మోటార్‌సైకిల్ చోరీ కేసులు ఉన్నట్లు పోలీసులు వెల్లడిం చారు. పెందుర్తి కేసుతోపాటు.. విశాఖలోని పీఎం పాలెంలో జ్యువెలరీ షాపులో బంగారం, వెండి చోరీ చేసినట్లు కూడా నిందితులు విచారణలో వెల్లడించినట్లు పోలీసులు తెలి పారు. అదేవిధంగా రాజమండ్రి, సామర్లకోట, కాకినాడ, గజపతినగరం, పాలకొల్లు, నరసాపురం, రాజోలు తదితర ప్రాంతాల్లో చోరీలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.
ఈ కేసుల్లో సుమారు రూ.23 లక్షల విలువైన బంగారం, వెండి, రెండు మోటార్ సైకిళ్లను పోలీసులు రికవరీ చేసి నట్లు తెలిపారు. డీసీపీ క్రైమ్స్ కె.లతామాధురి, అదనపు డీసీపీ ఎన్. రమ్య, ఏసీపీ క్రైమ్స్ ఏ.వెంకటరావు పర్యవేక్షణలో వెస్ట్ సబ్-డివిజన్ క్రైమ్ ఇన్స్పెక్టర్ బి.తిరుమలరావు ఆధ్వ ర్యంలో పెందుర్తి ఎసఐ డి.సూరి బాబు, ప్రత్యేక బృందం ఈ దర్యాప్తు చేపట్టింది. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.