కరూర్ తొక్కిసలాటలో 41 మంది మృతితో విజయ్ సంచలన నిర్ణయం
కపర్యటన 2 వారాల పాటు వాయిదా
అక్షర కిరణం, (చెన్నై/జాతీయం): తమిళనాడులోని కరూర్ జిల్లాలో ఇటీవల చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటన నటుడు, తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ అధినేత విజయ్ రాజకీయ భవిష్యత్తును తీవ్ర సంక్షోభంలోకి నెట్టిన సంగతి తెలిసిందే. కరూర్ జిల్లాలో ఇటీవల నిర్వహించిన ర్యాలీలో మహిళలు, చిన్నారులు సహా 41 మంది ప్రాణాలు కోల్పోవడం దేశవ్యాప్తంగా తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పదుల సంఖ్యలో ప్రజలు చనిపోవడం తో టీవీకే పార్టీ కీలక ప్రకటన చేసింది. ఈ సందర్భంగా విజయ్ తన రాష్ట్రవ్యాప్త పర్యటనను 2 వారాల పాటు తాత్కా లికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.
విజయ్ రాష్ట్ర వ్యాప్త పర్యటనలు వచ్చే రెండు వారాల పాటు తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు టీవీకే పార్టీ తన అధికారిక ఎక్స్ ఖాతాలో ప్రకటించింది. ప్రియమైన వారిని కోల్పోయి బాధలో ఉన్న ఈ పరిస్థితిలో.. విజయ్ పర్యటనను వాయిదా వేస్తున్నామమని.. కొత్త తేదీ వివరాలను తర్వాత ప్రకటిస్తామని టీవీకే పార్టీ పేర్కొంది. కరూర్ తొక్కిసలాట ఘటనలో చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు రూ. 20 లక్షల చొప్పున పరిహారం ప్రకటించిన విజయ్.. మంగళ వారం ఒక ఎమోషనల్ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. తొక్కిసలాట ఘటన జరిగిన తర్వాత తాను కరూర్ వెళ్లకపోవడానికి గల కారణాన్ని అందులో వివరించారు. తాను కరూర్ వెళ్లి ఉంటే.. అది మళ్లీ ఉద్రిక్త పరిస్థితికి దారి తీసేదని.. అందుకే వెళ్లలేదని తెలిపారు. త్వరలోనే తాను బాధిత కుటుంబాలను కలుస్తానని విజయ్ వెల్లడిరచారు. ఈ సందర్భంగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ను ఉద్దేశించి విజయ్ సంచలన ఆరోపణలు చేశారు. ‘‘సీఎం సార్, మీకు పగ తీర్చుకోవాలనే ఆలోచన ఉంటే, నన్ను ఏమైనా చేయండి, కానీ టీవీకే పార్టీ కార్యకర్తలను ముట్టుకోవద్దు’’ అంటూ డీఎంకే ప్రభుత్వానికి స్ట్రాంగ్ సందేశం ఇచ్చారు.
ఇక పోలీసుల విచారణలో నిర్వహణ లోపాలు స్పష్టంగా తెలిశాయి. 10 వేల మంది సామర్థ్యం ఉన్న వేదిక వద్ద దాదాపు 30 వేల మంది ప్రజలు గుమిగూడినట్లు పోలీసులు తెలిపారు. సెక్యూరిటీ ప్రోటోకాల్స్‌ను భారీగా ఉల్లంఘించడం.. ఆహారం, తాగునీటి ఏర్పాట్లు లేకపోవడమే ఈ విషాదానికి కారణమని పోలీసులు పేర్కొన్నారు. మధ్యాహ్నం నుంచే ర్యాలీ కోసం ప్రజలు ఆ ప్రాంతంలో గుమిగూడగా.. విజయ్ చాలా ఆలస్యంగా రాత్రి 7 గంటలకు చేరుకోవడంతో ఈ పరిస్థితి తలెత్తిందని వెల్లడిరచారు.
ఈ తొక్కిసలాట ఘటనపై పోలీసులు టీవీకే పార్టీకి చెందిన నాయకులపై కేసులు నమోదు చేశారు. పార్టీలో నెంబర్ 2 స్థానంలో ఉన్న విజయ్ సహాయకుడు ఎన్. ఆనంద్ సహా ఇతర నేతలపై హత్యానేరం కాని నేరాలు, మానవ జీవితానికి ప్రమాదం కలిగించే చర్యలు, ప్రభుత్వ అధికారి ఆదేశాలను ఉల్లంఘించడం వంటి అభియోగాలతో కేసులు పెట్టారు. తమిళనాడు పబ్లిక్ ప్రాపర్టీ (నష్టం నివారణ) చట్టం కింద కూడా కేసులు నమోదు అయ్యాయి.