కాశీబుగ్గలో తీవ్ర విషాదం
కవిజయ వేంకటేశ్వరస్వామి ఆలయంలో తొక్కిసలాట క9 మంది మృతి క40 మందికి గాయాలు కనలుగురి పరిస్థితి విషమం కసీఎం దిగ్భ్రాంతి
అక్షర కిరణం, (కాశీబుగ్గ): శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కాశీబుగ్గలో ఉన్న విజయవెంకటేశ్వర ఆలయంలో తొక్కిసలాట జరిగింది. 9 మంది భక్తులు చనిపోగా.. పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రుల్ని వెంటనే దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. కార్తీక మాసం, ఏకాదశి శనివారం కావడంతో వెంకటేశ్వరస్వామి ఆలయంలో స్వామివారి దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఏకాదశి కావడంతో వెంకటేశ్వర స్వామి ఆలయానికి భారీగా వచ్చిన భక్తులు తరలివచ్చారు. అయితే మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఏకాదశి కావడంతో స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా వచ్చారని స్థానికులు చెబుతున్నారు.
ఆలయంలో ఏర్పాటు చేసి క్యూలైన్లకు సంబంధించిన రెయిలింగ్ ఊడి పడటంతో భక్తులు కిందపడిపోవడంతో తొక్కిసలాట జరిగినట్లు చెబుతు న్నారు. ఆలయానికి వచ్చిన వారిలో ఎక్కువమంది మహిళా భక్తులు ఉన్నారని చెబుతున్నారు. ఈ ఆలయాన్ని 12 ఎకరాల్లో నిర్మించినట్లు చెబుతున్నారు. ఓ భక్తుడు తిరుమల శ్రీవారి ఆలయంలో దర్శనం దక్కలేదని కాశీబుగ్గలో నిర్మించినట్లు స్థానికులు చెబుతున్నారు. 12 ఎకరాల్లో రూ.10 కోట్లతో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఏకాదశి రోజు ఇంతమంది భక్తులు వస్తారని అంచనా వేయకపోవడంతోనే ఈ ఘటన జరిగిందంటున్నారు.
ఇది ఒక ప్రైవేటు వ్యక్తి నిర్మించిన దేవస్థానం. పలాసలో స్థిరపడిన ఒడిశా రాజ కుటుంబానికి చెందిన హరిముకుంద పండా ఈ ఆలయాన్ని నిర్మించారు. పలాస-కాశీబుగ్గ జంట పట్టణాల్లో కాశీబుగ్గ పెట్రోలు బంకు వెనుక ఉన్న పండా తోటల్లో సువిశాలమైన శ్రీ విజయ వేంకటేశ్వర స్వామి ఆలయం రూపుదిద్దుకుంది. హరిముకుంద పండా కుటుంబానికి కాశీబుగ్గలో సుమా రు వందెకరాల భూమి ఉంది. ఈ 100 ఎకరాల్లో ఉండే పండాగారి కొబ్బరి తోటలకు సుదీర్ఘ చరిత్ర ఉంది. అయితే, 12 ఎకరాల 40 సెంట్ల విస్తీర్ణంలో వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని పండా నిర్మించారు. ఈ ఆలయాన్ని 2023 ఆగస్టులో ప్రారంభించి భక్తులకు అందుబాటులోకి తెచ్చారు. అప్పటి నుంచీ ఈ ఆలయాన్ని జంట పట్టణాల్లోని భక్తులు తరలివస్తు న్నారు. శనివారం ఏకాదశి కావడం.. అందులోనూ శ్రీవారికి ప్రీతిపాత్రమైన రోజు కావడంతో భక్తులు పోటెత్తారు. ఆలయ సామర్థ్యం దాదాపు 3 వేల మంది అయితే.. 25 వేల వరకు భక్తులు వచ్చినట్టు సమాచారం.
శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గ వేంకటేశ్వర ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటన కలచివేసిందని సీఎం చంద్రబాబు అన్నారు. ‘శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో తొక్కిసలాట ఘటన కలచివేసింది. ఈ దురదృష్టకర ఘటనలో భక్తులు మరణించడం అత్యంత విషాదకరం. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. గాయాల పాలైన వారికి మేలైన సత్వర చికిత్స అందించాలని అధికారులను ఆదేశించాను. ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించాల్సిందిగా స్థానిక అధికారులను, ప్రజాప్రతినిధులను కోరాను’ అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. ఇటు దేవాదాయశాఖ మంత్రి ఆనం నారాయణరెడ్డి, జిల్లాకు చెందిన మంత్రి అచ్చెన్నాయుడు అధికారుల్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసు కుంటున్నారు. ఈ ఘటనలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.
విషయం తెలుసుకున్న మాజీ మంత్రి, పలాస మాజీ శాసనసభ్యుడు సీదిరి అప్పలరాజు ఘటనాస్థలికి వెళ్లారు. ఆయన స్వతహాగా డాక్టర్ కావడంతో.. అపస్మారక స్థితిలో ఉన్న కొంతమంది భక్తులకు సీపీఆర్ చేశారు. ఈ విపత్కర పరిస్థితిలో తన వంతు సాయం చేయడానికి ప్రయత్నించారు. అలాగే, మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఘటనాస్థలిని పరిశీలించారు. సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.