కంటి రోగుల జీవితాల్లో వెలుగు తెస్తున్న శంకర్ ఫౌండేషన్
కనేడు వ్యవస్థాపక వేడుకలు చేసుకుంటున్న ఆస్పత్రి
అక్షర కిరణం, (విశాఖపట్నం): శంకర్ ఫౌండేషన్ కంటి ఆసుపత్రి పేరు వినగానే కంటి రోగులు నిద్రలోనూ పరుగులు పెడుతుంటారు.. ఆంధ్రప్రదేశ్ తో పాటు పొరుగు రాష్ట్రాలకు చెందిన కంటి రోగుల్లో కొత్త వెలుగులు నింపుతూ నవ జీవనం వైపు వారిని నడిపిస్తోంది. చేతి కర్ర, కళ్లద్దాలను పక్కన పెడుతూ విప్పారిన నెత్రాలతో వడివడిగా అడుగులు వేయిస్తోంది... గ్రామీణ, ఏజెన్సీ, పట్టణ ప్రాంతాల ప్రజలకు శంకర్ ఫౌండేషన్ నేత్ర దానం చేస్తూ వారిలో నూతనత్వపు బీజాలు నాటి విశేషమైన సేవలు అందిస్తోంది. కంటి రోగుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపి నవ్య జీవనం తో ముందుకు సాగాలన్న దూరదృష్టి, సదాశయంతో శంకర్ ఫౌండేషన్ కంటి ఆసుపత్రిని ప్రారంభించిన దివంగత ఆత్మకూరి శంకరరావు 94వ జయంతి సందర్బంగా సెప్టెంబర్ 2వ తేదీన ఆసుపత్రి వ్యవస్థాపక వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్టు డీజీఎం కె బంగారు రాజు తెలిపారు.
వ్యాపారవేత్త శంకరరావు ఉన్నత ఆశయంతో కంటి ఆసుపత్రిని ప్రారంభించి ఉత్తర కోస్తా, ఆంధ్రప్రదేశ్లోని నేత్ర రోగుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. అంధత్వాన్ని తొలగించడం, పేదలకు సేవ చేయడమే లక్ష్యంగా పెట్టుకుని 1997లో సామాజిక బాధ్యతగా శంకరరావు, తన భార్య ఆత్మకూరి యశోద, దివంగత కె.పార్వతీకుమార్, డీవీ సుబ్బారావు సహకారం తో సింహాచలంలోని ఒక నిరాడంబరమైన రెండు పడకగదుల ఫ్లాట్లో శంకర్ ఫౌండేషన్ కంటి ఆసుపత్రి, పబ్లిక్ ఛారిటబుల్ ట్రస్ట్ స్థాపించారు. కేవలం ఇద్దరు వైద్యుల, 15 మంది ఉద్యోగులతో ఉచిత అవుట్ పేషెంట్ విభాగాన్ని ప్రారంభించారు. తరువాత అంచలంచెలుగా 2002లో అవుట్ పేషెంట్ కన్సల్టేషన్ రూ.20, 2008లో రూ.100 2015 నుండి రూ.250కు పెంచారు. గత 28 సంవత్సరాలుగా శంకర్ ఫౌండేషన్ కంటి ఆసుపత్రి నేత్ర రోగులకు మెరుగైన సేవలు అందిస్తూ మన్ననలు అందుకుంటోంది. శంకర్ ఫౌండేషన్ కంటి ఆసుపత్రి విశాఖపట్నంలోని నాయుడుతోటలో రెండెకరాల విశాలమైన స్థలంలో 200 పడకలతో ఐదు అంతస్తులలో అత్యాధునిక సౌకర్యాలు, ఎనిమిది ఆధునిక ఆపరేషన్ థియేటర్లు, అన్ని సబ్-స్పెషాలిటీలతో దిగ్విజయంగా నడుస్తోంది. 450 మందికి పైగా సిబ్బంది, సూపర్ స్పెషలిటీ వైద్యులు, అవుట్సోర్సింగ్ సిబ్బంది నిరం తరం సేవలు అందిస్తున్నారు. ఆస్పత్రిలో రోజుకు సగటున 120నుండి 150వరకూ కంటి శస్త్రచికిత్సలు చేస్తున్నారు. ప్రతిరోజూ 400 నుండి 500 మంది రోగులు ఆసుపత్రిని సందర్శిస్తున్నారు.
గ్లాకోమా చికిత్సలో పరిశోధన, క్లినికల్ ఖచ్చితత్వం రోగి ఫలితాలను మెరుగుపరచడంపై సహకరించడానికి ఫౌండేషన్ తాడేపల్లిగూడెంలోని ఎన్ఐటీతో ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది. నైపుణ్యాభివృద్ధి, నిబద్ధతను మరింత పెంచుకుంటూ కాలేజ్ ఆఫ్ ఆప్టోమెట్రీని కూడా నిర్వహిస్తోంది, ఇది కంటి సంరక్షణ సేవలలో ఆచరణాత్మక నైపుణ్యంతో ఔత్సాహిక నిపుణులను సన్నద్ధం చేయడానికి రూపొందించబడిన ఉద్యోగ-ఆధారిత వృత్తి కోర్సులను అందిస్తోంది .
ఆసుపత్రి నిర్వహణకు ప్రముఖ న్యాయవాది ఎం రాందాస్ నేతృత్వంలోని ట్రస్టీల బోర్డు మార్గనిర్దేశం చేస్తోంది. మేనేజింగ్ ట్రస్టీ, ఆస్పత్రి వ్యవస్థాపకులు శంకరరావు పెద్ద కుమారుడు ఆత్మకూరి కృష్ణకుమార్ ఆసుపత్రిని సమర్ధ వంతంగా ముందుకు నడిపిస్తున్నారు. జనరల్ మేనేజర్ కె.రాధాకృష్ణన్, ట్రస్టీలు ప్రొఫెసర్ ప్రసన్నకుమార్, ఎ.విజయ కుమార్ల సమష్టి కృషి ఫలితంగా ఆసుపత్రిని కొత్త శిఖరాలకు చేర్చారు. శంకర్ ఫౌండేషన్ దినదిన ప్రవర్దమానం చెండడానికి దివంగత కె.పార్వతీకుమార్, డీవీ సుబ్బారావు, ఎ.శంకరరావు, శంకరరావు భార్య ఆత్మకూరి యశోద, కేబీఎన్. మణిమాలల సహకారం ఎంతో తోడ్పాటు నిచ్చింది. దివంగత ఆత్మకూరి శంకరరావు శంకర్ ఫౌండేషన్ను కారుణ్య కంటి సంరక్షణ కేంద్రంగా మాత్రమే కాకుండా, భవిష్యత్ ఆరోగ్య సంరక్షణ కేంద్రంగా తయారు చేసారు. శంకర్ ఫౌండేషన్ ఉద్యోగ,ఆధారిత వృత్తిపర మైన కోర్సులను అందించే కాలేజ్ ఆఫ్ ఆప్టోమెట్రీని కూడా నిర్వహిస్తోందని డీజీఎం కె బంగారు రాజు తెలిపారు. శ్రీకాకుళం, మధురవాడ, మద్దిలపాలెం, గాజువాకలలో శాఖల ఏర్పాటుతో శంకర్ ఫౌండేషన్ ప్రముఖ నేత్ర సంరక్షణ ప్రదాతగా మారింది. దీనిని డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఎంప్యానెల్ చేశారు. ఈ.హెచ్. ఎస్,టీపీఐ, ప్రధాన కార్పొరేట్ సంస్థలు, రక్షణ సంస్థలతో నగదు రహిత సేవలను అందిస్తోంది. ఆసుపత్రి ప్రారంభం నుండి ఇప్పటి వరకు 4.90 లక్షలకు పైగా కంటి శస్త్ర చికిత్సలు నిర్వహించారు. 28.50లక్షల మంది అవుట్ పేషెంట్లను పరీక్షించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, జిల్లా పరి పాలన నుంచి మూడుసార్లు ఉత్తమ ఎన్జీఓ ఆసుపత్రిగా శంకర్ ఫౌండేషన్ ఆస్పత్రి అవార్డులు పొందింది.