రేషన్‌కార్డుదారులు కార్డుకు మొబైల్ నంబర్ తప్పనిసరిగా లింక్ చేసుకోవాలి!
అక్షర కిరణం, (అమరావతి): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతేడాది స్మార్ట్ రేషన్‌కార్డుల్ని పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. రేషన్ పంపిణీలో అక్రమాలకు తావు లేకుండా, ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ఈ కార్డుల్ని తీసుకొచ్చింది. అంతేకాదు ఏపీ ప్రభుత్వం ఈ కార్డులు ఉన్నవారికి రేషన్ పంపిణీతో పాటుగా సంక్షేమ పథకాలను కూడా అమలు చేస్తోంది. రేషన్ కార్డులు ఉన్న వారు ప్రతి నెలా సరుకులు తీసుకోవాల్సి ఉంటుంది. కొంతమంది లబ్ధిదారులు ప్రతి నెలా సరుకులు తీసుకుంటుండగా.. మరి కొందరు మూడు నెలలకు ఒకసారి సరుకులు తీసుకుం టున్నారు. కొంత మంది లబ్ధిదారులు నెలల తరబడి సరుకులు తీసుకోవడం లేదని అధికారులు గుర్తించారు.
ఏపీ ప్రభుత్వం రేషన్‌కార్డుకు సంబంధించి ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేసిన వారికి సరుకులు ఇస్తున్నారు. ఇప్పటికే రేషన్‌కార్డుల్లో ఉన్న వారికి 90 శాతం ఈకేవైసీ ప్రక్రియను కూడా పూర్తి చేశారు. రేషన్‌కార్డులో ఐదేళ్లువయసున్న వారి నుంచి 80 సంవత్సరాలలోపు వారు తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అలాగే మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై రేషన్ కార్డుకు వినియోగదారుడి మొబైల్ నంబర్ అనుసంధానం (లింక్) చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికీ చాలామంది రేషన్ కార్డులకు వారి మొబైల్ నంబర్లను లింక్ చేయలేదు. మొబైల్ నంబర్ లింకింగ్‌పై పౌరసరఫరాలశాఖ అధికారులు, డీలర్లు కార్డుదారులకు అవగాహన కల్పించి పూర్తి చేయాల్సిన బాధ్యత ఉంది అంటున్నారు. రేషన్ డీలర్ల దగ్గరకు వెళితే మొబైల్ నంబర్లను లింక్ చేస్తారని చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్‌కార్డులు ఉన్నవారికి బియ్యంతో పాటుగా మరికొన్ని సరుకుల్ని అందజేస్తున్నారు. ప్రతి నెలా 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు రేషన్ సరుకులు అందిస్తారు. 15 రోజుల పాటూ ఉదయం 8:00 గంటల నుంచి మధ్యాహ్నం 12:00 గంటల వరకు.. అలాగే సాయంత్రం 4:00 గంటల నుంచి రాత్రి 8:00 వరకు రేషన్‌షాపులు ఓపెన్ చేసి ఉంటాయి. అంతేకాదు ఆదివారంతో పాటుగా సెలవుదినాల్లో కూడా షాపులు పనిచేసేలా చూస్తున్నారు. వృద్ధులు, వికలాంగులకు ఇంటికే రేషన్ తీసుకెళ్లి ఇస్తున్నారు.
రాయితీపై నిత్యావసరాలు
అంతేకాదు నిత్యావసరాల ధరలు పెరగడంతో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైతు బజార్ల ద్వారా బియ్యం, ఉల్లి పాయల్ని రాయితీపై అందిస్తుంది. రేషన్ కార్డులు ఉన్నవారికి వీటిని అందిస్తున్నారు.. మిగిలిన వారుకూడా ఆధార్ కార్డు చూయించి సరుకులు తీసుకునే అవకాశం కల్పించారు. అంతేకాదు త్వరలో పామాయిల్, కందిపప్పును కూడా రాయితీపై అందిస్తామని ప్రభుత్వం తెలిపింది. గతేడాది కూడా ఉల్లిపాయలు, టమాటాల ధరలు పెరగడంతో రాయితీపై రాష్ట్రవ్యాప్తంగా రైతు బజార్ల ద్వారా రాయితీపై అందించిన సంగతి తెలిసిందే.