బిహార్‌లో పదోసారి సీఎంగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం..
అక్షర కిరణం, (పట్నా/జాతీయం): బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ) కూటమి 202 స్థానాలను కైవసం చేసు కుని అద్భుత విజయం సాధించిన తర్వాత కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. రికార్డు స్థాయిలో నితీష్ కుమార్ పదోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ ధాని పాట్నాలోని చారిత్రక గాంధీ మైదాన్‌లో గురువారం ఈ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. బిహార్ మంత్రివర్గ ప్రమాణ స్వీకారోత్సవం దేశంలో ఎన్డీఏ బలాన్ని చాటి చెప్పింది. నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సహా కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్‌సింగ్, జేపీ నడ్డా హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహా ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎంలు పాల్గొన్నారు.
మరోవైపు.. రికార్డు స్థాయిలో 10వసారి ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఈసారి పదవీ కాలాన్ని పూర్తి చేస్తే.. సిక్కిం మాజీ ముఖ్యమంత్రి పవన్ చామ్లింగ్ (24 సంవత్సరాలు) రికార్డును అధిగమించి.. దేశంలోనే అత్యధిక కాలం పనిచేసిన ముఖ్యమంత్రిగా నిలిచే అవకాశాలు ఉన్నాయి. ఇక నితీష్ కుమార్ సహా మొత్తం 27 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
ఈ ఎన్నికల్లో మొత్తం 243 స్థానాలకు ఎన్డీఏ కూటమి 202 సీట్లను సాధించింది. ఇందులో బీజేపీ 89 స్థానాల్లో విజయం సాధించగా.. బీజేపీలో 14 మందికి మంత్రి పదవులు దక్కాయి. ఇక 85 సీట్లు గెలిచిన జేడీయూకి 9 మంత్రి పదవులు దక్కాయి. మరోవైపు.. ఇద్దరు ఎమ్మెల్యేలు డిప్యూటీ సీఎంలుగా ఉంటారని పేర్కొన్నారు. బీజేపీ తరఫు నుంచి సామ్రాట్ చౌదరి, విజయ్ సిన్హాలు మరోసారి బిహార్ ఉపముఖ్యమంత్రులుగా ప్రమాణం చేశారు. బీజేపీ నుంచి దిలీప్ జైస్వాల్ వంటి అనుభవజ్ఞులతో పాటు.. కామ న్వెల్త్ గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్, షూటర్ రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన 34 ఏళ్ల శ్రేయసి సింగ్ కూడా మంత్రిగా ప్రమాణం చేశారు. బిహార్‌లో మంత్రి వర్గ ప్రమాణ స్వీకారం వేళ.. ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా అందరి కీ శుభాకాంక్షలు తెలిపారు. బిహార్ ప్రభుత్వంలో మంత్రులుగా ప్రమా ణ స్వీకారం చేసిన వారందరికీ శుభాకాంక్షలు అని పేర్కొన్నారు. ఇది అద్భుతమైన టీమ్ అని.. అంకితభావం కలిగిన నాయకులు బిహార్ రాష్ట్రాన్ని కొత్త శిఖరాలకు తీసుకువెళ్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
జేడీయూ నుంచి.. బిజేంద్ర ప్రసాద్ యాదవ్, శ్రవణ్ కుమార్, విజయ్‌కుమార్ చౌదరి, అశోక్ చౌదరి వంటి సీనియర్ నేతలకు మళ్లీ మంత్రి పదవులు దక్కాయి. చిరాగ్ పాశ్వాన్ లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ).. జితన్ రామ్ మాంరీa నేతృత్వంలోని హిందుస్తాన్ అవామ్ మోర్చా.. ఉపేంద్ర కుష్వాహా నేతృత్వంలోని రాష్ట్రీయ లోక్ మంచ్ నుంచి నితీష్ కుమార్ మంత్రివర్గంలో ఒక్కొక్కరికి మంత్రి పదవి దక్కింది.