కారు అద్దానికి తగిలాడని.. యువకుడిని కారుతో ఢీకొట్టి చంపిన భార్యాభర్తలు
కనిందితులు మనోజ్‌కుమార్, ఆరతి శర్మల అరెస్టు
అక్షర కిరణం, (బెంగళూర్/జాతీయం): చిన్న చిన్న కారణాలకు మనుషుల ప్రాణాలు తీసేంత రాక్షసంగా తయారవుతున్నారు కొందరు జనాలు. తాజాగా కర్ణాటకలో ఇదే తరహా దారుణం వెలుగు చూసింది. అనుకోకుండా ఓ కారు సైడ్ మిర్రర్‌కు తన బైక్‌తో డాష్ ఇచ్చాడో యువకుడు. ఇంత చిన్న కారణానికే ఆ యువకుడిని రెండు కిలోమీటర్లు వరకు వెంటాడి మరి కారుతో గుద్ది హత్య చేశారు ఓ జంట. కర్ణాటక, బెంగళూరులో వెలుగు చూసిన ఈ దారుణం వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక పుట్టేనహళ్లి పోలీస్ స్టేషన్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. దర్శన్ అనే వ్యక్తి తన స్నేహితుడు వరుణ్‌తో కలిసి.. ఎనిమిది రోజుల కిందట అక్టోబర్ 22వ తేదీ అర్ధరాత్రి సమయంలో శ్రీరామ లేఅవుట్లో బైకుపై వెళ్తున్నారు. అదే సమయంలో వీరి పక్కనే ఓ కారు కూడా వెళ్తుంది. అయితే చూసుకోకుండా దర్శన్ బైక్.. ఆ కారు సైడు మిర్రర్‌ను తాకింది. దీంతో కారులో ఉన్న మనోజ్‌కుమార్, అతడి భార్య ఆరతి శర్మ కారు దిగి వచ్చి.. దర్శన్‌తో గొడవ పెట్టుకున్నారు. గొడవ సద్దుమణగకపోవడంతో.. దర్శన్ బైక్ మీద వెళ్లిపోయాడు. దీంతో ఆగ్రహించిన దంపతులు.. కారులో దర్శన్ బైక్‌ను రెండు కిలోమీటర్ల మేర వెంబడిరచారు. ఆ తర్వాత వెనక నుంచి బైక్‌ని తమ కారుతో ఢీకొట్టి వెళ్లిపోయారు. ఈప్రమాదంలో దర్శన్, అతడి స్నేహితుడు వరుణ్ తీవ్రంగా గాయపడ్డారు. వీరిని గమనించిన స్థానికులు వెంటనే దర్శన్, వరుణ్‌లను ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ దర్శన్ మృతి చెందాడు. ప్రస్తుతం వరుణ్‌కి చికిత్స అందిస్తున్నారు. బైక్‌ని ఢీకొట్టిన తర్వాత కూడా మనోజ్, ఆరతి దంపతులు మరోసారి ఘటనా స్థలానికి వచ్చారు. అక్కడ వారి కారు విడి భాగాలు కొన్ని పడిపోగా.. వాటిని తీసుకెళ్లేందుకు వచ్చారు. అయితే తమను ఎవరైనా గుర్తు పడతారనే ఉద్దేశంతో ముఖానికి మాస్క్ ధరించారు. అయితే అక్కడున్న సీసీటీవీల్లో వీరి కదలికలు రికార్డ్ అయ్యాయి. ఈ సంఘటన మీద కేసు నమోదు చేసిన పోలీసులు.. సీసీటీవీ రికార్డు ఆధారంగా నిందితులను గుర్తించి.. వారిని అరెస్ట్ చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. ఇంత చిన్న కారణానికి హత్య చేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.