బరంపురం-విశాఖ రైలు వేళల్లో మార్పు
అక్షర కిరణం, (పొందూరు): బరంపురం- విశాఖపట్నం(18525) ఎక్స్‌ప్రెస్ రైలు వేళల్లో మార్పు చేయడంపై సీనియర్ సిటిజన్స్ సంఘం హర్షం ప్రకటించింది.మారిన వేళల మేరకు ఈ రైలు సోమవారం నుంచి స్ధానిక రైల్వే స్టేషన్ కు ఉదయం 9.43 గంట లకు వచ్చింది. గతంలో ఈ రైలు మధ్యాహ్నం 12.30గంటలకు వచ్చేది.లోగడ విశాఖపట్నం డివిజినల్ మేనేజర్‌కు తాము సమర్పించిన విజ్ఞాపన మేరకు ఈ చర్యలు తీసుకోవడం పట్ల ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.అయితే విశాఖ పట్నం నుంచి బరంపురం ఎక్స్ ప్రెస్ రైలు (18526) బయలుదేరే ఈ రైలు వేళల్లో ఎలాంటి మార్పు చేయలేదు.ఈ నేపథ్యంలో రైలును మధ్యాహ్నం 12.30 గంటలకు బయలుదేరేవిధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. దీనివల్ల ఉత్తరాంధ్ర ప్రయాణికులకు బాగా అనుకూలంగా ఉంటుంది. ఇక పొందూరులో ఆగే అన్ని రైళ్లు ఒకటో నెంబర్ ప్లాట్ ఫామ్ మీదుగా వెళ్లేటట్టు చూడాలని కోరిన మేరకు ఇటీవల వరకు అలానే నడిచేటట్టు చేశారు. ప్రస్తుతం దాదాపు అన్ని రైళ్లను రెండో ప్లాట్ ఫామ్ మీదుగా మళ్లిస్తున్నారు.ఇలా జరగడం వల్ల వృద్దులు, దివ్యాంగులు, చిన్నపిల్లల తల్లులు ఇబ్బందులకు లోనవుతున్నారు. గతంలో వలె ఒకటో నంబర్ ప్లాట్ ఫామ్ మీదుగా రైళ్లను మళ్లించాలని ఈ సంఘం కోరింది. శ్రీకాకుళం నుంచి తిరుపతి, శ్రీకాకుళం నుంచి సికింద్రా బాద్‌కు రైళ్లను నడపాలని కోరారు. ఈమేరకు కేంద్ర మంత్రి కె.రామ్మోహననాయుడు, ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్, రైల్వే అధికారులు స్పందించి వారానికి ఒకసారి ఈ రైళ్లను తిరిగేటట్టు చేశారని ఇందుకు సీని యర్ సిటిజన్ సంఘం ప్రతినిధులు ఎ.ధర్మారావు, ఎ.విజయకుమార్, పి.దివాకర్ పాత్రో తదితరులు అభినం దించారు. అయితే ఈ రైళ్లను పొందూరులో ఆపేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.