ఖాట్మండులో చిక్కుకున్న 8మంది మంగళగిరి వాసులు
కవీడియో కాల్లో మాట్లాడిన మంత్రి నారా లోకేష్
అక్షరకిరణం, (అమరావతి/జాతీయం): నేపాల్ రాజధాని ఖాట్మండులో 8మంది మంగళగిరి వాసులు చిక్కుకున్నారు. నేపాల్‌లోని పశుపతి ఫ్రంట్ హోటల్ లో మంగళగిరి వాసులు తలదాచుకున్నారు. మంగళగిరికి చెందిన మాచర్ల హేమసుందర్ రావు, దామర్ల నాగలక్ష్మితో వీడియో కాల్లో మంత్రి నారా లోకేష్ మాట్లాడారు. తాము ప్రయాణిస్తున్న బస్సుపై ఆందోళనకారులు దాడి చేశారని బాధితులు తెలిపారు. ప్రస్తుతం పశుపతి ఫ్రంట్ హోటల్లో తమతోపాటు మరో 40మంది తెలుగువారు తలదాచు కున్నట్లు మంగళగిరి వాసులు తెలిపారు. ఖాట్మాండు ఎయిర్ పోర్టుకు కిలోమీటరు దూరంలో తాము తలదాచు కున్న హోటల్ ఉందని మంగళగిరి వాసులు పేర్కొన్నారు. ఎవరు ఆందోళన చెందవద్దని, క్షేమంగా రాష్ట్రానికి తీసుకు వస్తామని లోకేష్ భరోసా ఇచ్చారు. మంగళగిరి వాసులతో రాష్ట్ర వైద్య మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు టచ్‌లో ఉంటారని లోకేష్ తెలిపారు. ఏపీ భవన్ అధికారి అర్జా శ్రీకాంత్, రాష్ట్రానికి చెందిన సీనియర్ అధికారులు కార్తికేయ మిశ్రా, ముఖేష్ కుమార్ మీనా, కోన శశిధర్, అజయ్ జైన్, హిమాన్షు శుక్లా, జయలక్ష్మితో మంత్రి లోకేష్ సమీక్ష చేశారు. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం 241మంది తెలుగువారు నేపాల్‌లో చిక్కుకున్నట్లు మంత్రి లోకేష్‌కు అధికారులు వివరించారు. సాధ్యమైనంత త్వరగా నేపాల్ చిక్కుకున్న రాష్ట్రానికి చేరుకునేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను లోకేష్ ఆదేశించారు.